పోషకాహారం (న్యూట్రిషియస్ డైట్): పోషకాలతో నిండిన ఆహారం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు

మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శక్తి లభిస్తుంది మరియు మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో చాలా రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ఏది మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన పోషకాహారం మన ఎదుగుదలకు, ఆరోగ్యానికి, వ్యాధులతో పోరాడడానికి చాలా అవసరం. మనం తినే ప్రతి ఆహారం మన శరీరం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలము.
పౌష్టికాహారం అంటే ఏమిటి?
పోషకాహారం కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారంలోని పోషక విలువలను అర్థం చేసుకోవడం మరియు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందించడమే పోషకాహారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పోషకాలు మన శరీరం యొక్క అన్ని ముఖ్యమైన విధులను నిర్వహించడానికి సహాయపడతాయి.
పౌష్టికాహారం ప్రాముఖ్యత
సరైన పోషకాహారం మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లాభాలను ఈ క్రింద వివరించడం జరిగింది:
- శక్తినిస్తుంది: మనం తీసుకునే ఆహారం మనకు రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
- శరీర ఎదుగుదలకు సహాయపడుతుంది: ముఖ్యంగా పిల్లలు మరియు యుక్త వయసులో సరైన పోషకాలు ఎముకలు, కండరాలు మరియు ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి.
- వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది: సరైన పోషకాలు మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి, తద్వారా మనం వివిధ రకాల వ్యాధుల నుండి రక్షించబడతాము.
- మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
- దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: సరైన సమతుల్య ఆహారం గుండె జబ్బులు, మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
పోషక ఆహారంలోని ముఖ్యమైన భాగాలు
మనం తీసుకునే పోషకాహారంలో ముఖ్యంగా రెండు రకాల పోషకాలు ఉంటాయి, అవేమనగా స్థూల పోషకాలు (Macronutrients) మరియు సూక్ష్మ పోషకాలు (Micronutrients):
- స్థూల పోషకాలు: వీటిని శరీరం ఎక్కువ మోతాదులో కోరుకుంటుంది. ఇవి మనకు శక్తినిస్తాయి మరియు శరీరం యొక్క నిర్మాణానికి సహాయపడతాయి. వీటిలో ముఖ్యమైనవి:
- పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు: ఇవి మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు. తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలలో లభిస్తాయి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి మరియు ఆరోగ్యానికి మంచివి.
- కొవ్వులు లేదా ఫ్యాట్స్: ఇవి శక్తిని నిల్వ చేస్తాయి, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి మరియు కొన్ని విటమిన్లను గ్రహించడానికి అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు (ఆలివ్ నూనె, గింజలు, అవకాడో) అనేవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు: ఇవి కణాల నిర్మాణం మరియు మరమ్మత్తుకు, ఎంజైమ్‌లు మరియు హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు మరియు పప్పుధాన్యాలలో ఇవి లభిస్తాయి.
- సూక్ష్మ పోషకాలు: వీటిని శరీరం తక్కువ మోతాదులో కోరుకుంటుంది, కానీ ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యమైనవి:
-
- విటమిన్లు: ఇవి శరీరంలోని అనేక రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలలో వివిధ రకాల విటమిన్లు లభిస్తాయి.
- ఖనిజాలు లేదా మినరల్స్: ఇవి ఎముకల నిర్మాణం, నరాల పనితీరు మరియు ఇతర ముఖ్యమైన విధులకు అవసరం. కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
గమనిక: నీరు కూడా ఒక ముఖ్యమైన పోషకం. ఇది మన శరీరం యొక్క అనేక విధులకు అవసరం మరియు పోషకాహారంలో కూడా ఇది ఒక ముఖ్యమైన భాగం.
పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు
సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు మరియు వ్యాధులు వస్తాయి. వీటిని పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు అంటారు. కొన్ని సాధారణ పోషకాహార లోపాలు మరియు వాటి వల్ల వచ్చే వ్యాధులు:
-
- ప్రోటీన్ లోపం: ఇది క్వాషియోర్కర్ (Kwashiorkor) మరియు మరాస్మస్ (Marasmus) వంటి వ్యాధులకు దారితీస్తుంది, దీనిలో ముఖ్యంగా పిల్లలలో ఎదుగుదల మందగించడం మరియు కండరాలు బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- విటమిన్ ఎ లోపం: ఇది రేచీకటి మరియు రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది.
- విటమిన్ డి లోపం: ఇది రికెట్స్ (పిల్లలలో ఎముకలు బలహీనంగా ఉండటం) మరియు పెద్దలలో ఆస్టియోమలాసియా (ఎముకలు మెత్తబడటం) వంటి సమస్యలకు దారితీస్తుంది.
- విటమిన్ సి లోపం: ఇది స్కర్విఅనే వ్యాధికి దారితీస్తుంది, దీనివల్ల చిగుళ్ల నుండి రక్తం రావడం మరియు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి.
- విటమిన్ బి12 లోపం: ఇది రక్తహీనతకు దారితీస్తుంది మరియు నరాల సమస్యలకు కారణమవుతుంది.
- ఐరన్ లోపం: శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత వస్తుంది, దీనివల్ల నీరసం మరియు బలహీనత కలుగుతాయి.
- అయోడిన్ లోపం: శరీరంలో అయోడిన్ లోపం అనేది గాయిటర్ కు దారితీస్తుంది మరియు పిల్లలలో మానసిక ఎదుగుదల మందగించడానికి కారణమవుతుంది.పైన వివరించినవే కాకుండా ఇంకా మరెన్నో లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మన శరీరం యొక్క సరైన పనితీరు కోసం అన్ని పోషకాలను సరైన మొత్తంలో తీసుకోవడం చాలా ముఖ్యం.
సమతుల్య ఆహరం
సమతుల్య ఆహారం అంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో కలిగి ఉన్న ఆహారం. ఇందులో పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు మరియు నీరు సరైన మోతాదులో ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలను నివారించవచ్చు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఈ సమతుల్య ఆహరం ఎలా తినాలి, ఎంత మోతాదు మరియు నిష్పత్తిలో వివిధ ఆహారాలు తీసుకోవాలి అనేది న్యూట్రిషనిస్టులు లేదా డైటిషన్ల సహాయంతో తెలుసుకోవచ్చును.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలి?
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడంలో ఈ క్రింది నియమాలు ప్రాముఖ్య పాత్రను పోషిస్తాయి:
- వివిధ రకాల పోషక ఆహారాలను తీసుకోండి: మీ ఆహారంలో అన్ని రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు ప్రోటీన్లను చేర్చండి.
- ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి: ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
- తగినంత నీరు త్రాగాలి: శరీరం యొక్క సరైన పనితీరు కోసం రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
- భోజనం సమయానికి తినండి: క్రమం తప్పకుండా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.
- చిరుతిళ్లను ఆరోగ్యకరంగా ఎంచుకోండి: పండ్లు, గింజలు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఎంచుకోండి.
- లేబుల్స్‌ను చదవండి: మీరు కొనుగోలు చేసే ఆహార పదార్థాల యొక్క పోషక విలువలను తెలుసుకోవడానికి లేబుల్స్‌ను చదవండి.
- మితంగా తినండి: అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ ఆకలిని గుర్తించి తగినంత మాత్రమే తినండి.
డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ సహాయం ఎప్పుడు తీసుకోవాలి?
ఈ క్రింది పరిస్థితుల్లో మీరు డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ సహాయం తీసుకోవడం మంచిది:
- బరువు సమస్యలు: అధిక బరువు లేదా తక్కువ బరువు కలిగి ఉంటే.
- దీర్ఘకాలిక వ్యాధులు: మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటివి ఉంటే ఆహార నియంత్రణ అవసరమవుతుంది.
- జీర్ణ సంబంధిత సమస్యలు: గ్యాస్, మలబద్ధకం, IBS వంటి సమస్యలు ఉంటే.
- ఆహార అలెర్జీలు: నిర్దిష్ట ఆహారాల వల్ల సమస్యలు ఉంటే.
- గర్భధారణ మరియు చనుబాలివ్వడం: ఈ సమయంలో సరైన పోషకాహారం కోసం.
- క్రీడాకారులు: మెరుగైన పనితీరు మరియు రికవరీ కోసం ప్రత్యేక ఆహారం అవసరమైతే
- అవగాహన లోపం: ఆరోగ్యకరమైన ఆహారం గురించి సరైన అవగాహన లేకపోతే
- అలవాట్ల మార్పు: ఆహారపు అలవాట్లను మార్చుకోవాలనుకుంటే
ముగింపు
సరైన పోషకాహారం మన ఆరోగ్యానికి ఒక బలమైన పునాది లాంటిది. మనం తీసుకునే న్యూట్రిషన్ ఆహారం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, మన రోజువారీ ఆహారంలో సరైన మార్పులు చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. కాబట్టి, మీ న్యూట్రిషన్‌పై శ్రద్ధ వహించండి మరియు ఆరోగ్యంగా ఉండండి!
యశోద హాస్పిటల్స్‌లో అనుభవజ్ఞులైన డైటీషియన్లు మరియు న్యూట్రిషనిస్ట్‌ల బృందం ఉంది. వీరు వివిధ ఆరోగ్య పరిస్థితులు ఉన్న పేషెంటులకు వ్యక్తిగతీకరించిన పోషకాహార మద్దతు మరియు సూచనలు అందిస్తారు. ప్రతి పేషెంటు యొక్క వైద్య చరిత్ర, వారి పరిస్థితి మరియు అవసరాలను క్షుణ్ణంగా విశ్లేషించి, వారి వయస్సు, బరువు, వైద్య పరిస్థితులు మరియు అవసరమైన అదనపు పోషకాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేకమైన ఆహార ప్రణాళికలను రూపొందిస్తారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంటులకే కాకుండా, ఇతర వైద్య నిపుణులచే సూచించబడిన బయటి రోగులకు కూడా నిరంతర పోషకాహార మద్దతును అందిస్తారు, తద్వారా ప్రతి ఒక్కరూ సమగ్రమైన మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణను పొందుతారు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.